బ్రిటీష్ పాలనా లేక హిట్లర్ పాలనా.. ఎమ్మెల్యే సీతక్క ట్వీట్..!

Monday, September 28th, 2020, 02:21:21 PM IST

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్ దగ్గరకు ర్యాలీగా వెళ్ళారు. రైతుల జీవితాన్ని దుర్భరం చేయడానికి, వ్యవసాయాన్ని నాశనం చేసేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని రైతు సమస్యలు చెప్పేందుకు గవర్నర్ దగ్గరకు వెళ్దామనుకున్నా పోలీసులు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అయితే ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా మానిక్కం ఠాగూర్ నియమితులు కాగా ఆయన ఈ రోజు హైదరాబాద్‌కి వచ్చారు.

అయితే రైతు సమస్యలను గవర్నర్‌కి వినిపించేందుకు బయలుదేరిన మానిక్కం ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్, బోసురాజు, దామోదర రాజనరసింహ, శ్రీనివాస్ కృష్ణన్, దాసోజు శ్రావణ్, అనిల్ కుమార్ యాదవ్, శ్రీధర్ బాబు తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనిని తప్పుపట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వ వైఖరిపై మండిపడింది. తెలంగాణకు విచ్చేసిన మానిక్కం ఠాగూర్ అన్నకు వెల్‌కం అంటూ, ఇది బ్రిటీష్ పాలనా లేక హిట్లర్ పాలనో చెప్పండన్న అని సీతక్క ట్వీట్ చేశారు.