నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయిందేమో.. ఎమ్మెల్యే రోజా కామెంట్స్..!

Friday, February 5th, 2021, 06:30:23 PM IST

MLA_Roja

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలకు ఎస్ఈసీ బ్రేక్స్ వేయడాన్ని రోజా తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో ఇక్కడ అక్రమాలు జరిగాయనే సాకుతో చిత్తూరు, గుంటూరు జిల్లా కలెక్టర్లను మార్చారని, అయితే కొత్త అధికారులను నియమించుకున్నాక కూడా ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించొద్దని, ఫిర్యాదులు పరిష్కరించాకే ఫలితాలు ప్రకటించాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రకటించడం చూస్తుంటే ఆయనపై ఆయనకే నమ్మకం లేదనిపిస్తోందని రోజా అన్నారు.

అయితే ప్రజలు చేసుకున్న ఏకగ్రీవాలను గౌరవించాలని ఆమె అన్నారు. నిమ్మగడ్డ ప్రవర్తన చూస్తే ఆయన చిన్న మెదడు చితికిపోయినట్లు అనుమానం వస్తోందని అన్నారు. సీఎం జగన్ సుపరిపాలన నచ్చి ప్రజలు ఏకగ్రీవాలను చేసుకుంటుంటే అది చూసి తట్టుకోలేకే నిమ్మగడ్డ ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు అండ్ కో డైరెక్షన్లో నిమ్మగడ్డ ఎలా పనిచేస్తున్నాడో చెప్పడానికి ఇదే ఉదాహరణ అని రోజా అన్నారు. ఇదిలా ఉంటే చిత్తూరు, గుంటూరు జిల్లాలో ఏకగ్రీమైన పంచాయతీలను ఎస్ఈసీ నిలిపేసింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఏకగ్రీవాలను ప్రకటించకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.