మార్చి 31 తర్వాత నిమ్మగడ్డను కుక్క కూడా పట్టించుకోదు – ఎమ్మెల్యే రోజా

Saturday, February 6th, 2021, 09:24:34 PM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికల పర్వం మొదలైనపట్టి నుంచి అధికార పార్టీ నేతలకు, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు మధ్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డపై వైసీపీ ఎమెల్యే రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు టీడీపీని సమాధి చేశారని, ఆ సమాధి నుంచి తీసి టీడీపీకి జీవం పోయాలని నిమ్మగడ్డ తాపత్రయ పడుతున్నారని రోజా అన్నారు. సుపరిపాలన, సంక్షేమపథకాలతో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ చేస్తున్నారని అందుకే ప్రజలు పంచాయితీలను ఏకగ్రీవాలు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారని కానీ నిమ్మగడ్డ వాటికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

టీడీపీని ఇక చంద్రబాబు, లోకేశ్ లేపలేరని అందుకే ఆ బాధ్యతను నిమ్మగడ్డపై పెట్టారని అన్నారు. టీడీపీకి నిమ్మగడ్డ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఇలాంటి ఎన్నికల అధికారిని మునుపెన్నడూ చూడలేదని రోజా అన్నారు. ఆయన పదవి అయిపోయాక టీడీపీలో చేరుతారేమోనని జోస్యం చెప్పారు. \మార్చి 31 తర్వాత అసలు నిమ్మగడ్డను కుక్క కూడా పట్టించుకోదని అన్నారు. అధికారులు ఎవరికీ భయపడి, ఎవరికీ అనుకూలంగా పని చేయాల్సిన అవసరం లేదని ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూస్తే సరిపోతుందని రోజా అన్నారు.