చంద్రబాబే ఎన్నికలకు భయపడి పారిపోయారు – ఎమ్మెల్యే రోజా

Sunday, January 24th, 2021, 11:09:32 PM IST

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీ చైర్ పర్సన్ రోజా తిరుమల లో శ్రీవారి ను దర్శించుకున్న అనంతరం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరును ప్రజలు గమనిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు జరపడం సబబు కాదని తన అభిప్రాయాలను వెల్లడించారు. ఎస్ ఈ సి నిర్ణయం ను తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాకముందే ఉద్యోగులు, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టల్సిన అవసరం ఏమిటి అంటూ ఎమ్మెల్యే రోజా సూటిగా ప్రశ్నించారు. అంతేకాక ప్రతి పక్ష పార్టీ తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు పై విమర్శలు చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏనాడూ కూడా ఎన్నికలకు భయపడలేదు అని అన్నారు.అది ప్రజలకు కూడా తెలుసు అని అన్నారు. అయితే 2018 లో చంద్రబాబే ఎన్నికలకు భయపడి పారిపోయారు అంటూ విమర్శించారు. కరోనా విపత్తు సమయం లో కూడా చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు పై రోజా విమర్శలు చేశారు. కోవిడ్ సమయం లో చంద్రబాబు ఎటువంటి సహకారం, సాయం అందించలేదు అని అన్నారు. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణ విషయం లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ను ఆశ్రయించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి అనుకూలం గా తీర్పు వస్తుంది అని భావిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికలు జరపాలి అని ఆదేశాలు ఇస్తే, ధర్మాసనం ను గౌరవించి ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. అయితే ప్రజల శ్రేయస్సు కోసమే వాయిదా వేయాలని కోరుతున్నాం అంటూ చెప్పుకొచ్చారు.