వాటిని కూడా మూసేయండి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్..!

Wednesday, March 24th, 2021, 08:55:29 PM IST


తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అయితే కరోనా తీవ్రత పెరగకుండా ఉండాలన్న, మళ్ళీ లాక్‌డౌన్ పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలన్న వైన్ షాపులు, బార్‌లు, సినిమా థియేటర్లు, పార్క్‌లు కూడా మూసేయాలని అన్నారు.

అయితే విద్యాసంస్థలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు తల్లిదండ్రుల నుంచి వసూల్ చేస్తున్న ఫీజులు విషయంపై స్పందించకపోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వమే ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలు ఆర్థిక సంక్షోభంలో ఉండరా అని ప్రశ్నించారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల ఒత్తిడి వల్ల మానసికంగా తల్లిదండ్రులకు లేని రోగాలు వస్తున్నాయని అన్నారు. అయితే తల్లిదండ్రులు చెల్లించిన ఫీజులో కనీసం సగమీనా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు స్కూళ్ల టీచర్లకు జీతాలు ఆపకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.