ఆయనలో మార్పు రాలేదు.. ఎస్వీపై ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఫైర్..!

Tuesday, November 17th, 2020, 02:37:58 AM IST


కర్నూల్ జిల్లా వైసీపీలో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. అధికార పార్టీలోనే లొసుగులు వినబడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిపై ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఫైర్ అయ్యారు. ఎస్వీ మోహన్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. మారిపోయాను, ఓ సామాన్య కార్యకర్తలా ఉండి పార్టీకోసం కష్టపడి పనిచేస్తానని చెప్పి ఎస్వీ మోహన్‌రెడ్డి పార్టీలో చేరాడని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు.

అయితే గతంలో ఎస్వీ మోహన్‌రెడ్డిని గెలిపిస్తే టీడీపీలో చేరారని గుర్తు చేశారు. ఆయనలో మార్పు వచ్చిందంటేనే ఆనాడు వైసీపీలో తిరిగి చేర్చుకున్నామని అన్నారు. పదవులు వద్దు అని ఆనాడు మాట్లాడి ఇప్పుడు తన అనుచర వర్గానికి పదవులు కావాలని అడుగుతున్నారని, పదేళ్లు కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. ఎస్వీ మోహన్‌రెడ్డి తీరుతో నిస్సహాయ స్థితిలో ఉన్నామని అసంతృప్తి వ్యక్తం చేశారు.