హారిక ఎవరో నాకు తెలియదు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు..!

Wednesday, March 10th, 2021, 11:52:30 PM IST


తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్‌బాస్ ఫేం దేత్తడి హారిక నియామకం రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా టూరిజం కార్పొరేషన్ డెవలప్‌మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త హారికను టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించి అపాయింట్‌మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు. అయితే పర్యాటకశాఖ మంత్రికి కానీ, ఉన్నత అధికారులకు కానీ తెలపకుండానే చైర్మన్ ఏకపక్షంగా హారిక నియామకం చేపట్టారని, హారిక వివరాలను టూరిజం శాఖ వెబ్‌సైట్ నుంచి కూడా తొలగించినట్టు వార్తలు వెలువడ్డాయి.

అయితే దీనిపై నిన్ననే చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే హారిక నియామకం చేపట్టామని, ఈ అంశంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. అంతేకాదు టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా హారికనే కొనసాగుతారని ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెప్పుకొచ్చారు.

అయితే తాజాగా దీనిపై తెలంగాణ ఎక్సైజ్‌, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హారిక నియామకం పట్ల సీఎంవోకు గానీ, ఉన్నతాధికారులకు గానీ ఎలాంటి సమాచారం లేదని, అసలు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని, త్వరలోనే ఈ పరిస్థితిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని అన్నారు. అంతేకాకుండా త్వరలోనే మరో సెలబ్రిటీని తెలంగాణ టూరిజానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు.