డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు అందరికీ రావు.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యలు వైరల్..!

Thursday, December 17th, 2020, 05:24:53 PM IST

అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్న మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటు ఉందని, ఏడాదిపాటు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరాలని తనకు ఉందని చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కాగా దీనిపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు.

అయితే తాజాగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్‌గా మారాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు అందరికీ రావని అన్నారు. కట్టినవి కొద్దిగానే కాబట్టి ప్రతి ఏడాది పేదలకు లాటరీ పద్ధతిలో కేటాయిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకొని తిరగవద్దని, అందరికీ ఇళ్లు ఇవ్వలేమని అన్నారు. భగవంతుడిని ప్రార్థిస్తే దయ ఉంటే ముందుగా మీకే లాటరీ తగులుతుందని, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం ఎదురు చూడకుండా ఆర్థిక స్థోమత ఉంటే ఇల్లు కట్టుకోవాలని సూచించడం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది.