దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి.. రఘురామకృష్ణంరాజుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్..!

Thursday, March 11th, 2021, 09:46:30 PM IST

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రఘురామకృష్ణంరాజు ఓ బ్లాక్ షీప్ అని, ఒక పార్టీలో గెలిచి మరో పార్టీ కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. సీఎల్పీ మీటింగ్ కు రఘురామకృష్ణంరాజు రావాలని మంత్రి పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. వార్డు మెంబర్ కూడా కాలేని వ్యక్తి ఎంపీ అయ్యాడని, ఇప్పుడేమో కొమ్ములు లేని దున్నపోతులా మాట్లాడుతున్నాడని అన్నారు.

అయితే రఘురామకృష్ణంరాజుకు సిగ్గుంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాల్ విసిరారు. ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లో రఘురామకృష్ణంరాజు శిఖండిలా మారారని, ఇంకోసారి నా గురించి మాట్లాడితే పరిస్థితి వేరుగా ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే నిత్యం ఏదో ఓ విషయంలో వైసీపీ ప్రభుత్వంపై రఘురామకృష్ణంరాజు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నాపై ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నందునే బీజేపీతో దగ్గరవుతున్నట్లు ఒక పెద్దరెడ్డి సీఎంకు చెప్పారని, అలాగైతే సీఎంపై 33 చార్జిషీట్లు ఉన్నాయని అందుకే ఆయన బీజేపీకి దగ్గరగా ఉన్నట్టా అని మంత్రి పెద్దిరెడ్డిని ఉద్దేశించి కౌంటర్ ఇచ్చారు.