తెలంగాణకు తీవ్ర అన్యాయం.. కేంద్రంపై నిప్పులు చెరిగిన కేటీఆర్..!

Friday, March 5th, 2021, 02:18:42 AM IST


తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఖాజీపేట రైల్వే‌కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదంటూ కేంద్రం చెప్పడంపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరారని, కోచ్ ఫ్యాక్టరీ కోసం 150 ఎకరాల విలువైన భూమిని రాష్ట్రం ప్రభుత్వం సేకరించి కేంద్రానికి ఇచ్చిందని అయినా కూడా కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు.

అయితే ఇప్పటికే హైదరాబాద్ నగర ఐటీ అభివృద్ధిని అడ్డుకునేలా ఐటీఐఆర్ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, హై స్పీడ్ ట్రైన్స్, బుల్లెట్ రైళ్ల విషయంలో కూడా తెలంగాణకు కేంద్రం మొండి చేయే చూపించిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అన్నది విభజన చట్టంలో తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగ బద్ధమైన హక్కు అని దానిని తుంగలో తొక్కి మరోసారి తెలంగాణ పట్ల తన వ్యతిరేక వైఖరీని బీజేపీ చాటుకుందని కేటీఆర్ అన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన హామీని రద్దు చేసే అధికారం బీజేపీ ప్రభుత్వానికి లేదని అన్నారు. దీనిపై టీఆర్ఎస్ ఎంపీలు రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నిస్తారని కేటీఆర్ తేల్చి చెప్పారు.