బిగ్ న్యూస్: ప్రధాని మోడీ ఆ పని చేశారా? – మంత్రి కేటీఆర్

Sunday, November 29th, 2020, 10:09:16 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం లో భాగంగా రోడ్ షో లో మంత్రి కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెరాస గెలిస్తేనే హైదరాబాద్ లో అభివృద్ది సాధ్యం అంటూ వ్యాఖ్యానించారు. నోటికొచ్చిన హామీలను ఇస్తూ బీజేపీ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు రాల్చుకోవాలని కుట్ర చేస్తున్నారు అంటూ ఆరోపించారు. అధికారంలోకి వస్తే నల్లధనం వెనక్కి తెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ పని చేశారా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే 15 లక్షల రూపాయలు పడితేనే బీజేపీ కి ఓటు వేయండి, లేదంటే తెరాస కి ఓటెయ్యండి అంటూ మంత్రి కేటీఆర్ నగర వాసులకి పిలుపు ఇచ్చారు. అయితే కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉంటే వార్త అని, ఇప్పుడు కరెంట్ పోతే వార్త అంటూ సెటైర్స్ వేశారు.

తెలంగాణ రాష్ట్రం లో ఇన్వర్తర్లు పోయి, ఇన్వెస్టర్లు వస్తున్నారు అని అన్నారు. అయితే కేసీఆర్ రాకముందు, వచ్చాక శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో బేరీజు వేసుకొని పరిశీలించండి అంటూ నగర వాసులకి సూచించారు. హైదరాబాద్ నగరం లో ఆరేళ్లలో ఎటువంటి అల్లర్లు లేవు అని, రౌడీ షీటర్ లు, గుండాలు లేరు అని స్పష్టం చేశారు. వరదలు వచ్చినప్పుడు ఢిల్లీ నేతలు ఒక్కరూ కూడా రాలేదు అని, సాయం అడిగిన కూడా అందించలేదు అని, ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేసింది అని తెలిపారు. అయితే వరదల సమయం లో రాని వారు ఇప్పుడు వస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. అంతేకాక వరద సాయం ను వచ్చే నెల 7 న ప్రజలకి అందిస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్.