వామనరావు దంపతుల హత్య బాధ కలిగించింది – మంత్రి కేటీఆర్

Wednesday, March 3rd, 2021, 07:43:31 AM IST

న్యాయవాది వామన రావు దంపతుల హత్య బాధ కలిగించింది అని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.న్యాయవాదులు తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారు అని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే వారినే సీఎం కేసీఆర్ అడ్వకేట్ జనరల్ గా నియమించినట్లు తెలిపారు. హైకోర్టు విభజన కోసం సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు ప్రధాని నరేంద్ర మోడీ ను విజ్ఞప్తి చేశారు అని, విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం కి అన్యాయం జరిగిందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక దేశమే అబ్బురపడే విధంగా కార్యక్రమాలు జరిగాయి అని, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక రైతులకు లబ్ది జరిగింది అని అన్నారు.

అయితే వామన రావు దంపతుల హత్య పట్ల మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హత్య కేసులో ఆరోపణలు వచ్చిన నేతను పార్టీ నుండి తొలగించినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాక హత్య తో ప్రమేయం ఉన్నవారికి కచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని అన్నారు.న్యాయవాదుల రక్షణ చట్టం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.అయితే న్యాయవాది వామన రావు దంపతుల హత్య ను కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారు అని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక న్యాయవాదుల కోసం ఏం చేసిందో చెప్పాలి అంటూ సూటిగా ప్రశ్నించారు. న్యాయవాదుల కోసం తమ ప్రభుత్వం 100 కోట్ల రూపాయల నిధి ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. గత పాలకుల హయాంలో ఎలాంటి అభివృద్ది జరగలేదు అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఎంతో అభివృద్ది చెందింది అని మంత్రి కేటీఆర్ అన్నారు.