టీడీపీ దొంగ పార్టీ.. చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి కొడాలి నాని..!

Tuesday, March 30th, 2021, 06:44:05 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ దొంగ పార్టీ అని, ఎన్టీఆర్ ఆశయాన్ని తుంగలో తొక్కారని అన్నారు. ఎన్టీఆర్ నాగలోకం అయితే చంద్రబాబు నక్కతో సమానమని అన్నారు. నిన్న జరిగింది టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కాదని, పగటివేషగాళ్ల డ్రామా అని కొడాలి నాని ఎద్దేవా చేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించే స్థాయి, టీడీపీకి అధ్యక్షుడిగా కొనసాగే హక్కు చంద్రబాబుకు లేదని అన్నారు.

అయితే రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయాయని చంద్రబాబు మాట్లాడడం సరికాదని, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని అన్నారు. కరోనా కష్ట కాలంలో అప్పులు చేసి మరీ సీఎం జగన్ ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నారని అన్నారు. సీఎం చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలను గెలుచుకుందని అన్నారు. ఎన్టీఆర్‌, వైఎస్‌ పరిపాలనకు సీఎం జగన్‌ నిజమైన వారసుడని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, స్టేలు తెచ్చుకోవడం చంద్రబాబు చరిత్ర అని, స్థానిక సంస్థల ఎన్నికలలో నిమ్మగడ్డ రమేష్‌ కూడా చంద్రబాబును కాపాడలేక పోయారని కొడాలి నాని అన్నారు.