షోకాజ్ నోటీస్ ఎఫెక్ట్.. ఎస్ఈసీకి వివరణ ఇచ్చుకున్న మంత్రి కొడాలి..!

Friday, February 12th, 2021, 06:32:51 PM IST

ఏపీ మంత్రి కొడాలి నాని ఎస్ఈసీ నిమ్మగడ్డపై చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర దుమారం రేపాయి. నేడు మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి కొడాలి రాష్ట్రంలో రేషన్ సరుకుల డోర్ డెలివరీని అడ్డుకునేందుకు ఎస్ఈసీ, చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని ఎస్ఈసీ నిమ్మగడ్డ, చంద్రబాబు కలిసి వచ్చినా అడ్డుకోలేరని వీరంతా జగన్నాథరథ చక్రాల కింద నలిగిపోవడం ఖాయమని అన్నారు. అంతేకాదు వారిద్దరు ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవాలని మంత్రి కొడాలి సూచించారు.

అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కించపరుస్తు మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఎస్‌ఈసీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. లేదంటే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఈ నేపధ్యంలో ఎస్‌ఈసీ షోకాజ్‌ నోటీస్‌కు మంత్రి కొడాలి నాని వివరణ ఇచ్చారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల తనకు గౌరవముందని ఎస్‌ఈసీని కించపరిచే ఉద్దేశం, ఆలోచన తనకు లేదని అన్నారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ తీరుపై ప్రజల్లో జరుగుతున్న ప్రచారాన్ని మాత్రమే తాను ప్రస్తావించానని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యల్లోని నిజమైన భావాన్ని ఎస్ఈసీ అర్ధం చేసుకోలేదని అన్నారు. కావున తాను చేసిన వ్యాఖ్యలను ఎస్ఈసీ మరోసారి పరిశీలించి షోకాజ్ నోటీసులు వెనక్కితీసుకోవాలని వివరణ లేఖలో మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.