బండి సంజయ్ ఎక్కువగా ఊహించుకుంటున్నారు.. మంత్రి జగదీశ్ రెడ్డి సెటైర్లు..!

Friday, November 20th, 2020, 04:44:55 PM IST

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి జగదీశ్ రెడ్డి సెటైర్లు వేశారు. తిట్లతోనే బీజేపీ ఓట్లు పొందాలని అనుకుంటుందని అన్నారు. వరద సాయం ఆపాలంటూ తాను లేఖ రాయలేదని బండి సంజయ్ అసత్యపు మాటలు మాట్లాడుతున్నారని, గుడి పేరిట అబద్దాలు మాట్లాడటం బీజేపీకి ముందు నుంచి అలవాటుగా మారిందని అన్నారు. వరద సాయం ఆపాలంటూ బండి సంజయ్ రాసిన లేఖ అబద్ధం అయితే వరద సాయం కొనసాగించాలని ఆయన మరో లేఖ రాయాల్సిందన్నారు.

అంతేకాదు గ్రేటర్ ఎన్నికలలో బీజేపీ గెలుస్తుందని బండి సంజయ్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టు ఉన్నారని, తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. అయితే గతంలో అసదుద్దీన్ ప్రధాన మంత్రిని కూడా కలిశారని, ప్రధాని అసదుద్దీన్‌తో ఎందుకు సమావేశం అయ్యారో బండి సంజయ్ ముందు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా టీఆర్ఎస్ మరోసారి మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయమని అన్నారు.