రైతులను చంపేసే చట్టాలను ప్రధాని మోదీ అమలు చేస్తున్నారు – జగదీశ్ రెడ్డి

Tuesday, December 22nd, 2020, 03:00:46 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల గురుంచి మాట్లాడిన మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర వ్యవసాయ చట్టాలతో రైతులకు ఇబ్బందులు తప్పవని, రైతుల జేబులకు చిల్లు పెట్టి కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెట్టే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కొత్త చట్టాలతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అంతేకాదు దేశంలో ఉన్న రైతులను చంపేసే చట్టాలను ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ మాత్రం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారని, రైతులకు ఆయన పెద్ద పీట వేస్తున్నారని చెప్పుకొచ్చారు. కేంద్ర తెచ్చిన వ్యవసాయ చట్టాలను టీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తుందని, వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.