బీజేపీ ఏ రకంగా మేలో ప్రజలే చెప్పాలి – మంత్రి హరీశ్ రావు

Tuesday, January 26th, 2021, 03:00:25 AM IST

తెలంగాణలో దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల అనంతరం బీజేపీ స్పీడు పెంచింది. అధికార టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరుగుతూ వచ్చే ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీపై మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. . కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలో టీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలను పోల్చుతూ మండిపడ్డారు.

అయితే కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం వృద్ధులకు రూ.500 పెన్షన్ ఇస్తుంటే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2000 రూపాయల పెన్షన్ ఇస్తుందని అన్నారు. ఆడపిల్ల పెళ్లికి కర్ణాటక ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు ఇస్తుందని హరీశ్ రావు చెప్పుకొచ్చారు. తెలంగాణలో రైతులకు 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇస్తుంటే కర్ణాటకలో 6 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని అన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం రైతుల పంటలకు సరైన మద్ధతు ధర ఇవ్వడం లేదని కందులకు కర్ణాటక ప్రభుత్వం క్వింటాకు 4 వేలు ఇస్తే, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 6 వేలకు కొంటుందని అన్నారు. ఈ తేడాలను చూసైనా ఏ ప్రభుత్వం ప్రజల మేలు కోరుతుందో ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.