ప్రజా సంక్షేమానికి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు – మంత్రి హరీశ్ రావు

Friday, October 30th, 2020, 07:29:43 AM IST

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం నేపధ్యం లో తెలంగాణ రాష్ట్ర అర్దిక శాఖ మంత్రి హరీశ్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం లో నైజాం పాలన నుండి గత ప్రభుత్వం వరకు భూమి శిస్తు వసూలు చేశారు అని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు బంధు పథకం ద్వారా డబ్బులు ఇచ్చి చరిత్ర తిరగ రాశారు అంటూ ప్రశంసించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెరాస అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల మనిషి అని, ప్రజా సంక్షేమానికి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు అని ఈ ప్రచార సభ లో హరీశ్ రావు అన్నారు.

అయితే బీజేపీ అధికారం ఉన్నటువంటి ఏ ఒక్క రాష్ట్రం లో కూడా ఉచిత విద్యుత్ సదుపాయం లేదు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతులకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవసాయ బిల్లు తీసుకు వచ్చింది అంటూ ఘాటు విమర్శలు చేశారు. విదేశీ మక్కలు తెచ్చి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టాలని బీజేపీ నాయకులు చూస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓట్ల కోసం వస్తే గ్రామాల్లోని మహిళలు ఖాళీ బిందెలతో అడ్డుకొనే వారు అని, ఇప్పుడు ఆ పరిస్తితి లేదు అని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికీ మంచి నీరు అందిస్తున్నారు అని, బీజేపీ నాయకులకి ఓట్ల ద్వారా బుద్ది చెప్పాలి అని, అంతేకాక దుబ్బాక అభివృద్ది బాధ్యత తనదే అంటూ హరీశ్ రావు అన్నారు.