లంచం ఇచ్చినట్లు చెబితే 10వేల గిఫ్ట్ ఇస్తా.. మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు..!

Sunday, December 27th, 2020, 10:00:09 PM IST

తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల గురుంచి మాట్లాడిన మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలోని కేసీఆర్‌ కాలనీలో మరో 168 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తి కావడంతో లబ్ధాదారులకు పట్టాలను అందించిన మంత్రి హరీశ్ రావు మనిషికి అతి ముఖ్యమైన ఇల్లు, పెళ్లికి తెలంగాణ ప్రభుత్వం సహాయం చేస్తుందని అన్నారు.

అయితే ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిన ఇల్లును అమ్మితే కేసు నమోదుచేస్తామని, అనర్హులు ఇల్లు తీసుకుంటే మరో పేదవాడికి అన్యాయం చేసినట్లేనని హరీశ్ రావు అన్నారు. రూపాయి ఖర్చు లేకుండా పేదలకు సొంతింటి కలను సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారని అన్నారు. లబ్దిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వం ఎంతో పాదర్శకంగా వ్యవహరిస్తోందని, బీజేపీ కార్యకర్తకు కూడా ఇల్లు వచ్చిందని అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరులో కొందరు లంచాలు వసూల్ చేస్తున్నట్టు ఆరోపణలు వినబడుతున్నాయని లబ్దిదారులు ఎవరికైనా రూపాయి లంచం ఇచ్చినట్లు చెబితే 10వేల గిఫ్ట్ ఇస్తానని, లంచం తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని హరీశ్ రావు అన్నారు.