కాంగ్రెస్ అంటే కాలిపోయే మోటార్లు…బీజేపీ అంటే బాయిల కాడ మీటర్లు

Wednesday, October 28th, 2020, 02:22:18 PM IST

దుబ్బాక ఉపఎన్నిక తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో గెలవడం అనేది ప్రతి ఒక్క పార్టీ కి ఎంతో ప్రతష్టాత్మకంగా మారింది. పోలింగ్ తేదీ దగ్గర అవుతున్న కొద్దీ ప్రత్యర్థుల పై ఒకరి మీద ఒకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ మేరకు దుబ్బాక మండలం లో అప్పనపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం లో భాగం గా మంత్రి హరీశ్ రావు ప్రతి పక్ష పార్టీ లపై ఘాటు విమర్శలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అంటే కాలిపొయే మోటార్లు అని, బీజేపీ అంటే బాయిల కాడ మీటర్లు అని మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం లోకి వచ్చాక నాలుగు సంవత్సరాల నుండి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. అయితే దేశంలో ఎక్కడైనా బీజేపీ మరియు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత విద్యుత్, రైతులకు పెట్టుబడి, భీమా సాయం అందిస్తున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు. భారత దేశం లో ఎక్కడా లేని విధంగా రెండు పంట కాలాల్లో కలిపి రైతులకు పెట్టుబడి గా 10 వేల రూపాయలు ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పనులు అన్నిటినీ ప్రజలు గమనిస్తూ, ఆలోచించి ఓటు వేయాలి అని హరీశ్ రావు అన్నారు. ఎన్నికలు అయ్యాక బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు మళ్లీ ఇటు వైపు వస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక మన ఇంట్లో వాళ్ళు ఎవరు, బయటి వాళ్ళు ఎవరు ఇదంతా ప్రజలు గమనించుకోవాలి అని అన్నారు.