బీజేపీ చెప్పేవన్ని అబద్ధాలే.. మంత్రి హరీశ్‌రావు క్లారిటీ..!

Friday, October 30th, 2020, 05:42:38 PM IST

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం వాడీ వేడీగా సాగుతుంది. అయితే ప్రచారంలో బీజేపీ చెబుతున్నవన్ని అబద్ధాలే అని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అబద్ధాలు చెప్పి ఈ ఉప ఎన్నికలో గెలవాలని బీజేపీ భావిస్తుందని ఆరోపించారు. గతంలో బీడీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ పుర్రె గుర్తును బహుమతిగా ఇస్తే బీజేపీ మాత్రం 18 శాతం జీఎస్టీని ఇచ్చిందని గుర్తుచేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీడీ కార్మికులను మోసం చేస్తే కేసీఆర్ మాత్రం పెన్షన్ ఇచ్చి వారిని ఆదుకున్నారని అన్నారు.

ఇకపోతే గొర్రెల యూనిట్లలో 50 వేలు బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని, గొర్రెల యూనిట్‌లో వంద శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పుకొచ్చారు. ఇదే కాదు కేసీఆర్ కిట్‌లో కూడా కేంద్రానిది నయా పైసా లేదని అన్నారు. రేషన్ బియ్యంపై కేంద్రం 29 రూపాయలు ఇస్తుంటే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇస్తుందని కూడా ప్రచారం చేస్తున్నారని అయితే కేంద్రం కేవలం సగం కార్డులకే సబ్సిడీ ఇస్తే మిగతా సగం కార్డులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుందని అన్నారు.