బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కేవలం ఓట్ల కోసం మాత్రమే వస్తున్నారు – హరీశ్ రావు

Monday, October 26th, 2020, 04:41:02 PM IST

దుబ్బాక ఉపఎన్నిక తెలంగాణ రాష్ట్రం లో ప్రతి ఒక్క పార్టీ కి కీలకం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రతి పక్ష పార్టీ నేతలు అధికార పార్టీ తీరును విమర్శిస్తూ వరుస ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు సైతం వారికి గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. అయితే దుబ్బాక లోని ఆర్య వైశ్య భవన్ లో నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం ఓట్ల కోసం మాత్రమే వస్తున్నారు అని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయం లో ఒక్కసారి కూడా దుబ్బాక కి రాలేదు అని పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం ఓట్ల కోసం వస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. హుజుర్ నగర్ లో తెరాస గెలిచిన అనంతరం ఆ నియోజక వర్గం కి 300 కోట్ల రూపాయల పనులు మంజూరు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు. అయితే అదే తరహాలో దుబ్బాక కి కూడా నిధులు ఇచ్చి అభివృద్ది చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

దుబ్బాక అభివృద్ది బాధ్యత కూడా తనదే అని మంత్రి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో దుబ్బాక ను అభివృద్ది చేస్తామని అన్నారు.