తెలంగాణ కోడలివైతే ఆ పని చేయ్.. షర్మిలపై మంత్రి గంగుల కామెంట్స్..!

Saturday, March 20th, 2021, 07:46:14 AM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీనీ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఆమె జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. అంతేకాదు వచ్చే నెల 9వ తేదిన ఖమ్మంలో భారీ సభ నిర్వహించి పార్టీనీ, పార్టీ విధి విధానాలను ప్రకటించేందుకు సిద్దమయ్యింది

ఈ నేపధ్యంలో వైఎస్ షర్మిలపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ కోడలు అని చెబుతున్న షర్మిల బలవంతంగా ఏపీలో కలిపిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఆ ఏడు మండలాల కోసం పాదయాత్ర చేస్తే ఇక్కడి ప్రజలు షర్మిలను తెలంగాణ కోడలిగా నమ్ముతారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ కన్నబిడ్డలా చూసుకుంటున్నారని, ఇతర ప్రాంతాల వారి ప్రాతినిధ్యం తెలంగాణకు అవసరం లేదని అన్నారు.