తెలంగాణలో తొలి కరోనా టీకా ఇచ్చేది ఎవరికంటే?

Wednesday, January 13th, 2021, 10:10:10 PM IST


ఏడాది కాలంగా కరోనా మహమ్మారి కారణంగా భయభ్రాంతులకు గురవుతున్న దేశ ప్రజలకు వ్యాక్సిన్ రావడం పెద్ద ఊరటను ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఈ నెల 16వ తేది నుంచి టీకా పంపిణీ జరుగుతున్న నేపధ్యంలో దేశవ్యాప్తంగా కరోనా టీకాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ తరుణంలో తెలంగాణకు సైతం వాక్సిన్ వచ్చేసింది. కరోనా వ్యాక్సిన్‌ హైదరాబాద్‌కు చేరిన నేపధ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. రాష్ట్రంలో తొలి కరోనా టీకా కర్మచారి అనే పారిశుధ్య కార్మికుడికి ఇవ్వనున్నట్లు ఈటల తెలిపారు.

అయితే రాష్ట్రానికి బుధవారం 20వేల కొవాగ్జిన్‌ డోసులు వచ్చాయని, తొలి రోజు 139 సెంటర్లలో ఒక్కో సెంటర్‌కు 30 మందికి చొప్పున వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపారు. తర్వాతి రోజు నుంచి 50, 100 ఇలా అంచెల వారీగా వాక్సిన్ డోసులను పెంచనున్నట్టు మంత్రి వెల్లడించారు. అయితే రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పటి వరకు 3.30 లక్షల మంది ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న‌ట్లు తెలిపారు. ఇదిలా ఉంటే మొదటగా గవర్నమెంట్ హెల్త్ కేర్ వర్కర్లకు, అనంతరం ప్రైవేటు హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించనున్నట్లు మంత్రి ఈటల చెప్పుకొచ్చారు.