వ్యాక్సిన్‌పై ఎలాంటి అనుమానాలు, అపోహలు వద్దు – మంత్రి ఈటల

Saturday, January 16th, 2021, 12:22:20 AM IST


దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ పంపిణీ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో తెలంగాణలో కూడా రేపటి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో మొదటగా తానే వ్యాక్సిన్ వేయించుకుంటానని మంత్రి ఈటల స్పష్టం చేశారు. వాక్సిన్ మానవ కళ్యాణం కోసమేనని దీనిపై ఎలాంటి అనుమానాలు, అపోహలు అవసరం లేదన్నారు.

అయితే కేంద్రం గైడ్‌లైన్స్ మేరకే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుందని, శాస్త్ర బద్దంగా అన్ని పరీక్షల తరువాతనే డీసీజీఐ వాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని ఈటల అన్నారు. తొలి డోసు కంపెనీ వ్యాక్సిన్‌నే రెండో డోసుగా తీసుకోవాలని మొదటి డోసు వేసుకున్న 28 రోజుల తరువాత రెండవ డోసు తప్పనిసరిగా వేసుకోవాలని ఈటల సూచించారు. మొదటి విడత ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే వారికి టీకా వేస్తామని, రెండో విడతలో ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బందికి టీకా వేస్తామని చెప్పుకొచ్చారు. భారత్ బయోటెక్ వాక్సిన్ మూడో దశ ట్రయల్స్ నడుస్తున్నాయని అవి పూర్తి కాగానే ఆ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుందని మంత్రి ఈటల తెలిపారు.