మా వంతు ప్రయత్నం చేస్తాం.. స్టీల్ ప్లాంట్‌పై మంత్రి బొత్స కామెంట్స్..!

Tuesday, March 9th, 2021, 01:14:33 AM IST


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై తమ ప్రభుత్వ వైఖరి మారదని, దీనిని అడ్డుకునేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని ప్రధాని మోదీకి సీఎం జగన్ ఇప్పటికే లేఖ రాశారని, మరి ప్రతిపక్ష టీడీపీ పార్టీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. టీడీపీ హయాంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అంకురార్పణ జరిగిందని అందుకే చంద్రబాబు ఈ విషయంలో సైలెంట్‌గా ఉన్నారని మంత్రి బొత్స ఆరోపణలు చేశారు.

ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని, ఈ విషయంలో రాష్ట్రానికి సంబంధం లేదని, స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్టు నేడు పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తేల్చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. నిన్న మొన్నటి వరకు తమ నిరసనలతో కేంద్రం ప్రభుత్వం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గుందని అనుకున్నా, కేంద్రం ఆ విధమైన ఆలోచనలు చేయడం లేదని నేడు స్పష్టమయ్యింది. దీంతో రేపటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమాన్ని మరింత ఉదృత్తం చేసేందుకు కార్మిక సంఘాలు, పలు రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి.