టీడీపీ బతికి బట్టకట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే.. మంత్రి బాలినేని కామెంట్స్..!

Tuesday, March 16th, 2021, 02:00:08 AM IST

ఏపీలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమిపాలై అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీలోకి జూనియర్ ఎన్‌టీఆర్ రావాలన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు ముందు కుప్పం రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు ముందే ఓ కార్యకర్త ఏకంగా జూనియర్ ఎన్‌టీఆర్‌ను టీడీపీలోకి తీసుకురావాలని, కుప్పానికి ప్రచారానికి తీసుకురండని కోరాడు. అయితే తాజాగా అధికార పార్టీ వైసీపీకి చెందిన నేత, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ బతికి బట్టకట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీలోకి రావాల్సిందే అని అన్నాడు.

అయితే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలవ్వడంతో పార్టీ ఏపీలో ఖతం అయిపోయిందని, టీడీపీ పూర్తిగా చచ్చిపోయిందని, కాస్తయినా టీడీపీ నిలదొక్కుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే అది సాధ్యం అవుతుందని అన్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రాజధాని అమరావతి పేరుతో డ్రామాలు ఆడుతున్నారని అర్థం అయిపోయిందని, అందుకే వైసీపీని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారని అన్నారు. చంద్రబాబు పని అయిపోయిందని, లోకేష్ వల్ల టీడీపీకి ఎలాంటి లాభం ఉండదని మంత్రి బాలినేని అన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే టీడీపీ కార్యకర్తలకు ఆశాదీపంలా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.