చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం.. మంత్రి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు..!

Tuesday, January 5th, 2021, 11:20:28 PM IST

ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ నేపధ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అయితే తాజాగా రాష్ట్ర పశుసంవర్ధక మరియు మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా టీడీపీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్రచేస్తున్నాయని, ఇప్పటి వరకు వ్యక్తుల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టిన చంద్రబాబు ఇప్పుడేమో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు.

అయితే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కంటే పెద్ద నటుడని తానే దేవాలయాలపై దాడులు చేయించి తానే ధర్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రతి అంశాన్ని తండ్రీకొడుకులు‌ రాజకీయం చేస్తున్నారని తండ్రి తీర్థయాత్రలు చేస్తుంటే, కొడుకు శవ యాత్రలు చేస్తున్నారనని మంత్రి సెటైర్లు వేశారు. రామతీర్థం ఘటనలో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని, ఈ ఘటనపై అవసరమైతే సీబీఐ దర్యాప్తు కోరతామని మంత్రి అప్పలరాజు చెప్పుకొచ్చారు.