పోలవరం ఎత్తును తగ్గించే ప్రసక్తే లేదు.. మంత్రి అనిల్ క్లారిటీ..!

Wednesday, December 2nd, 2020, 04:26:08 PM IST

పోలవరం ప్రాజెక్టు ఎత్తు, నీటి నిల్వసామర్థ్యంపై గత కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై నేడు అసెంబ్లీలో చర్చ జరగగా నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించి అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. పోలవరంపై అపోహలు కల్పించింది టీడీపీనే అని, పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు మిల్లీమీటర్ కూడా తగ్గించబోమని చెప్పుకొచ్చారు.

అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు ఎంత అవుతుందో తెలియని చంద్రబాబు ప్రాజెక్టు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు తన జీవితంలో ఏ ప్రాజెక్టు పూర్తిచేయలేదని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌లో 800 కోట్ల రూపాయలను ఆదా చేశామని, కరోనా సమయంలో కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపలేదన్నారు. తమ ప్రభుత్వం చెప్పిన సమయానికి ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తుందని మంత్రి అనిల్ స్పష్టం చేశారు.