చంద్రబాబు పనైపోయింది.. విశ్రాంతి తీసుకోవచ్చు – మంత్రి అనిల్

Wednesday, November 4th, 2020, 06:31:54 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. నేడు నెల్లూరు జిల్లాలో జరిగిన బీసీల సమావేశంలో పాల్గొన్న మంత్రి అనిల్ కుమార్ ఏపీలో ఇక చంద్రబాబు పనైపోయిందని వెళ్ళి హైదరాబాదులో విశ్రాంతి తీసుకోవచ్చని హితవు పలికారు. ఆయన కుమారుడు నారా లోకేశ్ ఇటీవల ట్రాక్టర్ స్టీరింగ్ వదిలేసి ప్రజలపైకి పోనివ్వబోయారని, ఇక టీడీపీ పార్టీ పరిస్థితి కూడా అంతే అని ఎద్దేవా చేశారు.

అయితే గత ప్రభుత్వాలు బీసీలను ఎంతగానో మోసం చేశాయని, స్వాతంత్రం వచ్చాక బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం వైసీపీ ఒక్కటే అని అన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే నడుస్తానని, ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేనని అన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా జగన్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గదని, స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా వైసీపీదే పైచేయని అన్నారు.