ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్..!

Thursday, April 15th, 2021, 01:18:58 AM IST


దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. కానీ ఏపీలో మాత్రం రోజుకు 4 వేల కేసులు నమోదవుతున్నా కూడా స్కూళ్లు, కాలేజీలు అలాగే నడిపిస్తున్నారు. అయితే కరోనా తీవ్రత మరింత పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. టెన్త్, ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. కేంద్రం సీబీఎస్ఈసీ పరీక్షలను రద్దు చేయడంతో ఏపీ ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తుందన్న చర్చ మొదలయ్యింది.

అయితే దీనిపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు సురేశ్ ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలలో కోవిడ్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మున్ముందు కోవిడ్ కేసులు పెరిగితే అప్పుడు పరీక్షల నిర్వహణపై ఆలోచిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌తో సమీక్ష జరిపి పరీక్షల నిర్వహణపై చర్చిస్తామన్నారు. విద్యాసంస్థల్లో కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాల్సిందేనని అలా పాటించని స్కూళ్లు, కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మే 5వ తేది నుంచి మే 22 వరకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగనుండగా, మే 6వ తేదీ నుంచి మే 23 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. ఇక పదో తరగతి పరీక్షలు జూన్ 7వ తేది నుంచి జూన్ 14 వరకు జరగనున్నాయి.