టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన..!

Saturday, May 15th, 2021, 07:25:59 PM IST


ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా కొనసాగుతున్న నేపధ్యంలో హైకోర్టు సూచనల మేరకు పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే ఏపీలో కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా పరీక్షల రద్దు అంశంపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ముందుగానే షెడ్యూల్ ప్రకటించి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమయ్యిందని, త్వరలోనే పరీక్షల షెడ్యూల్‌పై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.