విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్ధతు ప్రకటించిన మెగస్టార్ చిరంజీవి..!

Thursday, March 11th, 2021, 01:08:08 AM IST


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదంటూ కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఉక్కు ఉద్యమం మరింత తీవ్రతరమయ్యింది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఉక్కు ఉద్యమానికి అండగా నిలిచాయి. అయితే తాజాగా మెగస్టార్ చిరంజీవి కూడా ఉక్కు ఉద్యమానికి తన మద్ధతు ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో త్యాగాలకు ప్రతీక అని, అలాంటి పరిశ్రమను ఇప్పుడు నష్టాల పేరుతో ప్రైవేటీకరిస్తామనడం దారుణం అని అన్నారు. ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కదలిరావాలని పిలుపునిచ్చారు.

అయితే ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా తన చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయని, నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతబట్టి గోడల మీద విశాఖ ఉక్కు సాధిస్తామనే నినాదాన్ని రాశామని, హర్తాళ్లు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశామని గుర్తు చేసుకున్నారు. దాదాపు 35 మంది పౌరులతో పాటు, 9 ఏళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఆనాటి మహోద్యమ త్యాగాల ఫలితంగా సాకారమైన విశాఖ ఉక్కు కర్మాగరం ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు అందరం సంబరాలు చేసుకున్నామన్నారు. ఆంధ్రుల హక్కుగా, ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా భావించి సంతోషించామన్నారు. విశాఖ ఉక్కుకు దేశంలోనే ఓ ప్రత్యేకత, విశిష్టత ఉందని తెలిసి గర్వించామన్నారు.

అంతేకాదు విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇన్నేళ్లయినా క్యాప్టివ్‌మైన్స్ కేటాయించకపోవడం, అలాగే నష్టాలొస్తున్నాయనే సాకుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం సమంజసం కాదన్నారు. లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రయివేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని కోరారు. ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్‌ను ప్రజల మనోభావాలను గౌవరించి కేంద్రం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలన్నారు. విశాఖ ఉక్కును రక్షించుకోవడమే ఇప్పుడు ప్రధాన కర్తవ్యమని, ఇది ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన, న్యాయ సమ్మతమైన హక్కని ఆయన పేర్కొన్నారు. ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకుందామని అన్నారు.