బ్లాక్ బాక్స్ లభించేందుకు మరో వారం!

Thursday, January 1st, 2015, 06:22:36 PM IST


ఇండోనేషియా నుండి సింగపూర్ వెళుతూ మార్గం మధ్యలో జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం బ్లాక్ బాక్స్ కోసం మరో వారం ఆగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మేరకు విమానం కూలిపోయిన ప్రదేశంలో వాతావరణం అనుకూలించక పోవడంతో బ్లాక్ బాక్స్ లభించేందుకు మరో వారం రోజులు పట్టవచ్చునని ఇండోనేషియా అధికారులు పేర్కొంటున్నారు. కాగా బ్లాక్ బాక్స్ లభిస్తే ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం తెలిసే అవకాశముంటుంది.

ఇక మరోవైపు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల కోసం ఐదోరోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే విమానంలో 162మంది ప్రయాణించినప్పటికీ కేవలం ఏడు మృతదేహాలను మాత్రమే వెలికితీయగాలిగారు. కాగా భారీ వర్షం, విపరీతమైన గాలులతో ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో గాలింపు చర్యలు సాధ్యం కావడం లేనట్లు తెలుస్తోంది.