టీఆర్ఎస్ ఎమ్మెల్యేను హెచ్చరిస్తూ మావోయిస్టుల లేఖ విడుదల..!

Saturday, February 6th, 2021, 07:54:17 AM IST

తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మంచిర్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు, ఆయన కుమారుడు భూదందాలు, కబ్జాలకు పాల్పడుతున్నారని వాటిని ఆపేయాలని సూచిస్తూ సింగరేణి కోల్‌బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. అయితే ప్రజల సమస్యలు గాలికి వదిలేసి భూముల సెటిల్మెంట్ల పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారని అందులో పేర్కొన్నారు.

అంతేకాదు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలను ఎవరిని విడిచిపెట్టమని అందరిపై చర్యలు తీసుకుంటామని లేఖలో పేర్కొన్నారు. గుడిపేటలో 2004లో శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నిర్మాణం చేపట్టారని, అప్పట్లో ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని కానీ ఇప్పటి వరకు వారి సమస్యలు పరిష్కరించడం లేదని లేఖలో పేర్కొన్నారు. ముంపు గ్రామాల్లో ఉన్న తన అనుచరులు, అధికారులతో కుమ్మక్కై ఎమ్మెల్యే కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, ఇకనైనా పద్ధతి మార్చుకుని ప్రజల సమస్యను పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు.