మరో ఐదేళ్లలో కేసీఆర్ అంబానీతో పోటీ పడతాడు – మాణికం ఠాగూర్

Friday, October 2nd, 2020, 09:37:14 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సంగారెడ్డిలో జరిగిన నిరసనలో పాల్గొన్న ఆయన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లక్ష్యాలకు విరుద్ధంగా సీఎం కేసీఆర్‌ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్‌ ఒక్కరే ధనవంతుడిగా మారారని, మరో ఐదేళ్లలో కేసీఆర్ అంబానీతో పోటీపడతారని అన్నారు.

కేసీఆర్ ఇంట్లో బాత్‌రూమ్‌ కూడా డబుల్‌ బెడ్‌రూమ్‌ కంటే పెద్దదని, 2023లో తెలంగాణలో 73 సీట్లు గెలిచి కాంగ్రెస్‌ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీనీ ఓడించే సత్తా రాహుల్ గాంధీకే ఉందని, ఐక్యంగా పనిచేస్తే కాంగ్రెస్ ఎవరినైనా ఓడించగలదని అన్నారు. మోదీ, అమిత్‌షా రైతులను అంబానీ చేతుల్లో పెట్టారని ఆరోపించారు.