విశ్లేషణ: దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలు ఇవే..!

Wednesday, November 11th, 2020, 04:27:05 PM IST

దేశవ్యాప్తంగా దుబ్బాక పేరు ఒక్కసారిగా మారుమోగింది. 2018 సార్వత్రిక ఎన్నికలలో దుబ్బాక నుంచి గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. అయితే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేయగా, బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి బరిలో నిలిచారు. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని మునపటి కంటే భారీ మెజారిటీతో గెలిపించుకుని ప్రత్యర్ధి పార్టీలకు బుద్ధి చెప్పాలని భావించగా, ఈ ఎన్నికలలో గెలిచి రానున్న ఎన్నికలలో తమదే అధికారం అని చెప్పుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తహతహలాడాయి. అయితే అనుకున్నదే తడవుగా ఒకరిని మించి ఒకరు హోరాహోరీగా ప్రచారం నిర్వహించగా, ఈ నెల 3 వ తేదిన ఆ స్థానానికి పోలింగ్ జరిగింది.

అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే టీఆర్ఎస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నడిచింది. నిన్న ఈ ఓట్ల లెక్కింపు జరగగా నరాలు తెగే ఉత్కంఠ.. మునుపెన్నడూ లేనంత సస్పెన్స్.. చివరి రౌండ్ లెక్కింపు వరకు విజయం దోబూచులాట.. కారు జోరుకు, కాషాయ జెండా పోరుకు జరిగిన టప్ ఫైట్‌లో ఎట్టకేలకు బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1,470 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే మొత్తం మీద బీజేపీకి 62,772 ఓట్లు రాగా, టీఆర్ఎస్‌కు 61,302 ఓట్లు, కాంగ్రెస్‌కు 21,819 ఓట్లు పోలయ్యాయి.

ఇదిలా ఉంటే 2018 సాధారణ ఎన్నికల్లో 60 వేలపైగా ఓట్ల మెజార్టీతో దుబ్బాకలో గెలిచిన టీఆర్ఎస్ ఉప ఎన్నికలో బీజేపీ చేతిలో ఓడిపోవడం, ఓటమి ఎరుగని ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్ రావు ముందుండి నడిపించినా టీఆర్ఎస్ గట్టెక్కలేకపోయింది. అయితే దుబ్బాక ఉప ఎన్నికలో అసలు టీఆర్ఎస్ ఓటమికి గల ప్రధాన కారణాలను మన తెలుగు ఇన్ క్లుప్తంగా విశ్లేషించింది.

అభివృద్ధి జరగకపోవడం:

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సిద్దిపేట, గజ్వేల్‌ను అభివృద్ధి చేసుకున్నారు కానీ పక్కనే ఉన్న తమ దుబ్బాక నియోజకవర్గాన్ని అసలు పట్టించుకోలేదన్న భావన దుబ్బాక ఓటర్లలో ఏర్పడడం టీఆర్ఎస్ ఓటమికి ముఖ్య కారణమని చెప్పుకోవచ్చు.

టీఆర్ఎస్ ఓవర్ కాన్‌ఫిడెన్స్:

దుబ్బాక ఉప ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని టీఆర్ఎస్ నేతలు ఓవర్ కాన్‌ఫిడెన్స్ తో ఉండడం, బీజేపీ, కాంగ్రెస్ నేతలంతా దుబ్బాకలో తిష్ట వేసి ప్రచారం చేస్తే టీఆర్ఎస్ తరపున మాత్రం ఒక్క హరీశ్ రావు మాత్రమే పూర్తి భారాన్ని నెత్తిన పెట్టుకోవడం.

మల్లన్న సాగర్ ముంపు బాధితుల అంశం:

టీఆర్ఎస్ ఓటమికి మల్లన్నసాగర్ ముంపు బాధితుల్లో ఉన్న అసంతృప్తి కూడా ఓ కారణమని చెప్పుకోవచ్చు. సిద్ధిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో ముంపు బాధితులకు ఇచ్చిన పరిహారంతో పోలిస్తే దుబ్బాకలో మల్లన్నసాగర్ ముంపు బాధితులకు ఇచ్చిన పరిహారం చాలా తక్కువ కావడంతో వారంతా ఒకింత అసహనంతో ఉండడం కూడా టీఆర్ఎస్ ఓటమికి కారణమయ్యింది.

సోలిపేట కుటుంబంపై వ్యతిరేకత:

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పెద్దగా నియోజకవర్గానికి ఏమీ చేయలేదన్న అపవాదు ఉండడం, ఇక ఆయన కుమారుడిపై కూడా ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉండడం. అయితే ఇది టీఆర్ఎస్ ముందుగానే పసిగట్టినప్పటికి భర్త చనిపోయాడన్న సింపతీ, మహిళ అన్న కారణంగా ఆ వ్యతిరేకతను అధిగమించి గెలుపొందవచ్చని రామలింగారెడ్డి భార్య సుజాతకే టీఆర్ఎస్ టికెట్ కట్టబెట్టింది. కానీ ఈ విషయంలో టీఆర్ఎస్ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి.

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కోల్పోవడం:

మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని ఎన్నికల ముందు కోల్పోవడం కూడా టీఆర్ఎస్ ఓటమికి మరో కారణం. చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంచి ఇమేజ్ ఉన్న నాయకుడు మరియు స్థానికుడు అలాంటి నేతను బుజ్జగించి లేదా మరేదైనా హామీ ఇచ్చి ఆయనను కాంగ్రెస్‌లోకి వెళ్ళకుండా ఆపగలిగి ఉంటే చెరుకు అనుచర వర్గం అంతా టీఆర్ఎస్‌కే మద్ధతు తెలిపి ఉండేది. అప్పుడు టీఆర్ఎస్ విజయం సులభమయ్యేది.

రఘునందన్‌రావుపై సానుభూతి:

దుబ్బాక నుంచి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో రఘునందన్ రావు పోటీ చేసి ఓడిపోయాడు. అంతేకాదు 2019 పార్లమెంట్ ఎన్నికలలో మెదక్ నుంచి పోటీ చేసి కూడా ఓటమిపాలయ్యాడు. అయితే వరుసగా ఓడిపోతున్నా ఆత్మస్థైర్యంతో రఘునందన్ రావు ఎల్లప్పుడు ప్రజల మధ్యే ఉండేవాడు. సోలిపేట మరణం తరువాత ఉప ఎన్నికలు ఖాయమనుకుని అందరికన్నా ముందుగానే ప్రచారాన్ని మొదలుపెట్టారు. తన మాటలతో, ప్రసంగాలతో యువతను బాగా ఆకట్టుకున్నాడు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుకున్నాడు. అయితే వరుసగా ఓడిపోతున్నాడన్న సింపతీ, ఒకసారి అవకాశం ఇద్దామన్న భావన ప్రజలలో బలంగా కలగింది.

ఇక వీటికి తోడు కరోనాను ఎదురుకునే అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని, కరోనా లెక్కలలో పారదర్శకత చూపించడంలేదన్న అంశం మరియు దుబ్బాక ఉప ఎన్నికలు జరిగే సమయానికి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం, ఫ్లాట్లు ఉన్నవారంతా ఎల్‌ఆర్ఎస్ చేయించుకోవాలని ప్రభుత్వం నిబంధనల పెట్టడంపై కూడా తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఈ ప్రభావం కూడా దుబ్బాక ఉప ఎన్నికల్లో పడిందనే వాదన వినిపిస్తుంది. అయితే ఇక్కడ విజయకేతనం ఎగరేసి అదే ఊపుతో గ్రేటర్ ఎన్నికలకు సిద్దం కావాలని ఆశించిన టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి.