రాజధానిపై వెనక్కి తగ్గిన సీఎం జగన్.. అసలు కారణం ఇదేనా?

Wednesday, August 12th, 2020, 07:07:06 AM IST

ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత రాజధాని అమరావతిని లెజిస్లేటివ్ రాజధానిగా, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా, కర్నూల్‌ని న్యాయ రాజధానిగా చేయాలని భావించింది. అయితే దీని కోసం తీసుకొచ్చిన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ కూడా ఆమోదం తెలపడంతో రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలించేందుకు జగన్ ప్రభుత్వం సిద్దమయ్యిందని, ఈ నెల 16వ తేదిన శంకుస్థాపన కూడా చేయబోతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అంతేకాదు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీనీ ఆహ్వానించాలని, కరోనా నేపధ్యంలో ప్రత్యక్షంగా కాకపోయినా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైనా ఆయనతో శంకుస్థాపన చేయించాలని ప్రభుత్వం భావించినట్టు టాక్ వినిపించింది. అయితే మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించి న్యాయస్థానాలలో ఇంకా కేసులు నడుస్తుండడంతో అన్ని క్లియర్ అయిన తర్వాతనే రాజధానిని విశాఖకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని, ఈ కారణంగా శంకుస్థాపనకు కొత్త ముహూర్తంగా విజయదశమిని ఖరారు చేసినట్టు సమాచారం. అంతేకాదు ఆ రోజు శంకుస్థాపనకు ప్రధాని మోదీనీ సీఎం జగన్ స్వయంగా ఢిల్లీ వెళ్లి ఆహ్వానించబోతున్నారని పార్టీలో ప్రచారం జరుగుతుంది. అయితే శంఖుస్థాపన వాయిదా పడడానికి కోర్టుల్లో ఉన్న కేసులే కారణమా లేక సీఎం జగన్ ఈ విషయంలో మరేదైనా స్ట్రాటజీ ఫాలో అవుతున్నారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.