తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టంలోని ముఖ్యాంశాలు..!

Wednesday, September 9th, 2020, 04:01:34 PM IST

KCR_assembly

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చే నేపధ్యంలో వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. అయితే కొత్త రెవెన్యూ బిల్లును నేడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ కొత్త చట్టానికి సంబంధించిన అంశాలను పూర్తిగా వివరించారు. భూ సమస్యల కోసం ఇకపై ఎవరూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఇంచు భూమిని సర్వే చేయిస్తామని అన్నారు. ప్రతి భూమికి అక్షాంశాలు, రేఖాంశాలుగా కొలతలు నిర్దేశిస్తారని చెప్పుకొచ్చారు.

అయితే అధికారులు చట్టం ప్రకారమే పనిచేయాల్సిన అవసరం ఉంటుందని, ఏ అధికారికి విచక్షణ అధికారాలు ఉండవని తెలిపారు. ఇకపై రెవెన్యూ కోర్టులు కూడా ఉండవని తెలిపారు. అయితే అన్ని వివరాలతో ధరణి పోర్టల్ వస్తుందని, అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ విభాగాలుగా ధరణి పోర్టల్ వస్తుందని అన్నారు. అవినీతి అంతం కావాలనే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. అయితే ఉద్యోగులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వారి ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని వారికి ఆప్షన్లు ఇచ్చి ఇతర శాఖల్లో ఉద్యోగం కేటాయిస్తామని అన్నారు. ఇక తహశీల్ధార్‌కు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగిస్తున్నామని అయితే వారికి కేవలం వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసేందుకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయేతర భూములను, స్థలాలను సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసే అధికారాలు ఉంటాయని అన్నారు. కొత్త చట్టం ద్వారా అందరికి మేలు జరుగుతుందని ఇక భూముల విషయంలో తగాదాలు ఉండవని చెప్పుకొచ్చారు.