మహేష్ బాబు మెచ్చుకున్నారు అంటున్న సుప్రియ!

Sunday, August 5th, 2018, 11:25:56 AM IST

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి మనమరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి ఎంట్రీ ఇచ్చిన సుప్రియ యార్లగడ్డ, ఆ తరువాత చిత్రాల్లో నటించడం మానేసి తెరవెనుక ఉంటూ అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. అయితే అప్పుడెప్పుడో ఇరవైఏళ్ళ క్రితం నటించిన ఆ సినిమా తరువాత ప్రస్తుతం ఇరవైయేళ్ళకు, ఆమె అడివి శేష్ హీరోగా రూపొందిన గూఢచారి సినిమాతో మళ్లి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం విజయవంతంగా దూసుకెళ్తున్న సందర్భంగా ఆమె మీడియాతో చిత్ర అనుభవాల గురించి పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ మొదట దర్శకుడు శశికిరణ్, మరియు హీరో అడివి శేష్ ఇద్దరు కథ వినిపించడానికి తన వద్దకు వచ్చారని, అయితే కథ విని చాలా ఎక్సయిట్ అయ్యానని అన్నారు. తరువాత వాళ్లిద్దరూ నన్ను నాదియా పాత్ర నన్ను చేయమని అడిగారు.

అయితే ఆ పాత్రలో నటించగలనా లేదా, అని కాసేపు ఆలోచించానని, తనకు వాస్తవంగా నెగటివ్ ఇంపాక్ట్ వున్న పాత్రలు చేయాలనీ వుందని చెప్పారు. కానీ ఈ పాత్ర నెగటివ్ గా లేనప్పటికీ కూడా నటించేటప్పుడు మాత్రం నెగటివ్, పోసిటివ్ రెండిటి కలయికగా ఉండాలని చెప్పారు అన్నారు. ఇప్పుడు సినిమా హిట్ అయి స్క్రీన్ పై తన పాత్రకు మంచి పేరువచ్చిందంటే, అది నిజంగా చాలావరకు దర్శకుని గొప్పతనమే అన్నారు. ఇకపై తనకు కొత్త అవకాశాలు వస్తాయని, ఇండస్ట్రీకి సరికొత్త సినిమాలు రావడం మంచి పరిణామమని అన్నారు. అయితే ఇటీవల మహేష్ బాబు కొత్త సినిమా అన్నపూర్ణ లో షూటింగ్ జరుగుతుండగా వెళ్లానని, అక్కడ తనని చూసిన మహేష్ బాబు గూఢచారి చూసాను మీ నటన సూపర్బ్, ఇంత రహస్యంగా ఎప్పుడు నటించారు, అలానే ఇకపై నటిస్తారా అంటూ అడిగారట. దానికి ఆమె మంచి కథ, పాత్ర దొరికితే చేస్తానని చెప్పారట. తన పాత్ర విషయమై అంతపెద్ద సూపర్ స్టార్ మెచ్చుకోవడం నిజంగా గ్రేట్ అని సుప్రియ తన ఆనందాన్ని వెలిబుచ్చారు……