10 కోట్ల‌తో మా అసోసియేష‌న్ సొంత బిల్డింగ్‌?

Monday, December 11th, 2017, 04:40:35 PM IST

దాదాపు 800 మంది ఆర్టిస్టులు ఉన్న అతిపెద్ద‌ సంఘం `మా అసోసియేష‌న్‌`. ఇండియాలోనే అతిపెద్ద ఆర్టిస్టుల సంఘాల్లో ఇది ఒక‌టి. అలాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క సంఘానికి సొంత బిల్డింగ్ లేక‌పోవ‌డంపై సీరియ‌స్‌గా చ‌ర్చ సాగుతోంది. వంద‌ల కోట్ల రూపాయ‌ల డీల్స్ న‌డిపించే టాలీవుడ్లో ఆర్టిస్టులకు సొంతంగా ఓ భ‌వంతి లేక‌పోవ‌డం అన్న‌ది ఇబ్బందిక‌ర‌మైన ప‌రిణామ‌మే. అందుకే ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలు ఈ విష‌యంపై సీరియ‌స్‌గా ప‌రిశీలిస్తున్నార‌ని తెలుస్తోంది.

`మా` మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ 25 వ‌సంతాల పండ‌గ‌కు సిద్ధ‌మ‌వుతున్న వేళ శివాజీ రాజా అండ్ టీమ్ అందుకు సంబంధించిన ప్ర‌కట‌న‌ను వెలువ‌రించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా `మా అసోసియేష‌న్‌` సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు విదేశాల్లో జ‌ర‌గ‌నున్నాయి. హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ హోట‌ల్ లో ప‌లువురు సినీపెద్ద‌ల మ‌ధ్య ఘ‌నంగా జ‌రిగిన క‌ర్టెన్ రైజ‌ర్ కార్య‌క్ర‌మం అనంత‌రం పెద్ద‌లంతా మా అసోసియేష‌న్ సొంత బిల్డింగ్ ఏర్పాటు గురించి ముచ్చ‌టించుకున్నారు. తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్, తెలంగాణ ఎఫ్ డి.సీ చైర్మ‌న్ రామ్మోహ‌న‌రావు, ఏపీ ఎఫ్ .డి.సీ చైర్మ‌న్ అంబికా కృష్ణ‌ల‌ను ఈ సంద‌ర్భంగా `మా` ఘ‌నంగా స‌న్మానించింది.
25 ఏళ్ల పండ‌గ వేళ మా స‌భ్యులంతా అసోసియేష‌న్ సొంత బిల్డింగుపై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూప‌ర్‌స్టార్ కృష్ణ పున‌రుద్ఘాటించారు. అయితే మా సొంత బిల్డింగ్ కావాలంటే 5-10 కోట్లు మినిమంగా అవ‌స‌రం అవుతాయి. ఆ మేర‌కు ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మాలు త‌ల‌పెట్టే అవ‌కాశం ఉంది. ఇక కోలీవుడ్‌లోనూ న‌డిగ‌ర సంఘానికి సొంత బిల్డింగ్ ఏర్పాటుపై సీరియ‌స్‌గా ప్ర‌య‌త్నాలు సాగుతున్న సంగ‌తి తెలిసిందే.