ఏపీ లో పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం

Tuesday, February 9th, 2021, 07:26:25 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల తోలి దశ పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభం అయింది. రాష్ట్రం లోని విజయనగరం మినహా 12 జిల్లాల్లో 2,723 పంచాయితీ లకు, 20,157 వార్డు లకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ జరగనుంది. 4 గంటల నుండి ఓట్ల లెక్కింపు తో పాటే, ఫలితాలను ప్రకటించడం జరుగుతుంది. అయితే నోటిఫికేషన్ ఇచ్చిన 3,249 గ్రామ పంచాయితీ లకు గానూ 525 చోట్ల ఏక గ్రీవాలు అయ్యాయి. ముందుగా గుంటూరు మరియు చిత్తూరు జిల్లాలలో భారీగా ఏక గ్రీవాలు జరగగా వాటిని నిలిపివేశారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అయితే సోమవారం సాయంత్రం ఏక గ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎన్నికల కమిషనర్.

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం తో కరోనా వైరస్ సోకిన వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. కరోనా సోకిన వారు మైదాన ప్రాంతాల్లో 2:30 నుండి 3 గంటల వరకు ఓటు వేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 12:30 గంటల నుండి 1:30 గంటల వరకు ఓటు వేసే లా చర్యలు తీసుకున్నారు. అయితే సాధారణ ఓటర్ల కి థర్మల్ స్కానింగ్ చేసి ఉష్ణోగ్రత అధికంగా ఉన్న వారిని వెనక్కి పంపి చివరి గంటల్లో అవకాశం ఇవ్వనున్నారు.అధికారులు సైతం కరోనా వైరస్ నియమ నిబంధనలు పాటించనున్నారు.