చంద్రబాబుపై కేసులు నమోదు చేయండి.. ఎస్ఈసీకి వైసీపీ నేత ఫిర్యాదు..!

Saturday, February 6th, 2021, 12:33:22 AM IST


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కలిసిన వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు లేఖ అందించారు. పంచాయితీ ఎన్నికలపై మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబుపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసినందున చర్యలు తీసుకోవాలని ఇదివరకే కోరామని కానీ ఎస్ఈసీ మాత్రం మేనిఫెస్టోను మాత్రమే రద్దు చేశారని అన్నారు.

అయితే ఎన్నికల నియమావళిని చంద్రబాబు ఉల్లంఘించారని అందుకే ఆయనపై కేసులు నమోదు చేయాలని కోరామని అన్నారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను నిలిపివేయాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవడం సరికాదని చంద్రబాబుకు నిమ్మగడ్డ తొత్తులా వ్యవహరించకుండా పారదర్శకంగా ఎన్నికలు జరపాలని అన్నారు. పంచాయితీలను ఏకగ్రీవం చేసుకునే స్వేచ్చ ప్రజలకు ఉందని దానికి ఎస్ఈసీ అడ్డుచెప్పడం మంచిది కాదని అన్నారు.