పెద్దపల్లి జిల్లాలో దారుణం.. హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య..!

Wednesday, February 17th, 2021, 06:35:35 PM IST

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. న్యాయవాది దంపతులను దుండగులు అతి కిరాతకంగా నరికి చంపారు. హైకోర్టు న్యాయవాది గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులు కారులో మంథని నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రామగిరి మండలం సమీపంలో వీరి కారును మరో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు అడ్డగించారు. అనంతరం వారిపై కత్తులతో దాడి చేశారు.

అయితే దాడి అనంతరం కారు దిగి వామన్‌రావు రోడ్డుపైకి పరుగులు పెట్టారు. రక్తపు మడుగులో ఉన్న వామన్‌రావును చూసి స్థానికులు ఏం జరిగిందని ప్రశ్నించగా కుంట శ్రీనివాస్, ఆయన అనుచరులు తమపై దాడి చేసినట్టు చెప్పుకొచ్చారు. అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచారు. హత్యకు గురైన న్యాయవాద దంపతులది మంథని మండలం గుంజపడుగు స్వగ్రామం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.