ఎన్టీఆర్ పేరును అవమానిస్తున్నారు!

Tuesday, December 2nd, 2014, 06:51:58 PM IST


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి మంగళవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడ ఎయిర్ పోర్టుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు పేరును పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించేలా ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తెలుగుదేశం కృషి చేయ్యాలని లక్ష్మీపార్వతి సూచించారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టేముందు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను సంప్రదించి ఉంటే వివాదం వచ్చేదేకాదని పేర్కొన్నారు. అలాగే ఎన్టీఆర్ పేరును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివాదాలలోకి లాగి అవమానిస్తున్నారంటూ లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఎన్టీఆర్ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలంటూ ఇటీవల లక్ష్మీపార్వతి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే!