సీఎం జగన్‌ను ఎవరు ఏమి చేయలేరు.. లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు..!

Monday, January 18th, 2021, 05:12:06 PM IST

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్మీపార్వతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా ఇంట్లో జనవరి 1న చిన్న ఎన్టీఆర్ పుట్టాడని, అప్పుడే పిల్లాడికి ఎన్టీఆర్ అని పేరు పెట్టుకున్నామని అన్నారు. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తన భర్త ఆశీస్సులు ఆ బిడ్డపై ఎల్లప్పుడూ ఉండాలని లక్మీపార్వతి అన్నారు.

అయితే ఏపీలో సీఎం జగన్ నాయకత్వంలో రామరాజ్యం సాగుతుందని, సంక్షేమం, అభివృద్ది దిశగా జగన్ ప్రభుత్వం సాగుతుందని చెప్పుకొచ్చారు. జగన్‌ మంచి పాలన చూసి ఓర్వలేక విగ్రహాల ధ్వంసం పేరిట కొందరు నీచమైన కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 25 ఏళ్ల క్రితం ఏ విధమైన కుట్రలు జరిగాయో ఇప్పుడు కూడా అదే విధమైన కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. అయితే ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్‌ను ఎవరు ఏమి చేయలేరని, ప్రజాభిమానమే జగన్‌కు శ్రీరామరక్ష అని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు.