ఎయిర్ పోర్టులో సంగక్కరకు అవమానం!

Tuesday, May 12th, 2015, 06:13:24 PM IST


ప్రముఖ శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కరకు లండన్ విమానాశ్రయంలో ఘోర పరాభవం జరిగింది. ఈ
మేరకు తనకు జరిగిన అవమానంపై సంగక్కర తన ట్విట్టర్ ఖాతాలో వివరించారు. ఇక వివరాల్లోకి వెళితే కౌంటీ క్రికెట్ ఆడేందుకు లండన్ వెళ్ళిన తనపై ఇమ్మిగ్రేషన్ అధికారి రంగు వివక్షను ప్రదర్శించాడని కుమార సంగక్కర ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అయితే దీనిపై పూర్తి వివరాలను వెల్లడించని సంగక్కర తనకు జరిగిన అవమానంపై మాత్రం సోషల్ సైట్ ట్విట్టర్ ముఖతా బాధను పంచుకున్నాడు.

ఇక సంగక్కర తన ట్విట్టర్లో ‘గత 15 సంవత్సరాలుగా లండన్ కౌంటీలో క్రికెట్ ఆడుతున్నా.. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు.. రంగు, మతం, ప్రతిష్టదేముంది? ప్రతి ఒక్క ప్రయాణికుడికీ మర్యాదివ్వాలి.. తనిఖీలు పక్కగా ఉండడంలో తప్పులేదు కానీ అవతలి వ్యక్తులు కనీస సంస్కారాన్ని పాటించాలి.. గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఎయిర్ పోర్టు అధికారుల నుండి వివక్షను ఎదుర్కున్నా’ అంటూ ఆవేదనతో కూడిన సందేశాన్ని పోస్ట్ చేసాడు.