కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ లేఖ… ఏం కోరాడంటే?

Friday, December 25th, 2020, 03:00:22 AM IST

కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలోని హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ పరిశ్రమ అభివృద్ధి కోసం నిధులతో పాటు మరికొన్ని అంశాలపై కేంద్రాన్ని మద్ధతు కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు తోపాటు, సిరిసిల్లలో మెగా పవర్ క్లస్టర్ మంజూరు, చేనేత, జౌళి పరిశ్రమ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల గురుంచి కూడా లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలకి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని స్మృతి ఇరానీని కోరారు.

ఇక ఇదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ని 1552 కోట్ల ఖర్చుతో చేపట్టిందని అయితే ఇందులో దాదాపు 1100 కోట్ల రూపాయలు మౌలిక వసతుల కల్పనకు అవసరమవుతాయని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మెగా టెక్స్‌టైల్ పార్క్ పథకం ద్వారా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ కి మద్దతు అందించాలని కోరారు. ఈ పథకం ద్వారా కేంద్రం దాదాపు 500 కోట్లను అందించే అవకాశం ఉందని, ఇందులో 300 కోట్లను వెంటనే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ మౌలికవసతుల సదుపాయాల కల్పన కోసం మంజూరు చేయాలని కోరారు.