దళారులను నమ్మి మోసపోవద్దు.. మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి..!

Saturday, September 26th, 2020, 05:50:39 PM IST

జీహెచ్ఎంసీ పరిధిలోని రెవెన్యూ సమస్యలపైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కాలనీల సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నగరం గత ఆరు సంవత్సరాలలో దేశంలోని లక్షలాది మందికి ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందని అన్నారు. ఒకవైపు పెట్టుబడులు మరోవైపు పరిపాలనా సంస్కరణలు, రాజకీయ స్థిరత్వంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ విస్తరిస్తుందని అన్నారు.

అయితే తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరి వ్యవసాయ భూముల పైన వారి హక్కులు కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు పోతుందని అన్నారు. ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదని, ఎవరి ఆస్తుల పైన వారి హక్కులు కల్పించాలన్న ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుందని అన్నారు. రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎవరు కూడా దళారులను నమ్మవద్దని ఒక్క పైసా కూడా ఎవరికి ఇవ్వొద్దని ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందని సూచించారు.