జీహెచ్ఎంసీ చట్టంతో పాటు మరో 4 చట్టాలకు సవరణలు.. అవి ఏమిటంటే?

Tuesday, October 13th, 2020, 01:35:31 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంతో సహా మరో 4 చట్టాలకు కొత్త సవరణలు చేయబోతున్నట్టు అసెంబ్లీ సమావేశాలలో మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. దేశంలోనే మొదటిసారిగా మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్న తమ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సవరణ తీసుకొచ్చామని అన్నారు. ఇక హరితహారం వల్ల రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని కేంద్ర నివేదిక తెలిపిందని, అయితే పచ్చదనంపై బడ్జెట్‌లో కేవలం 2.5 శాతం మాత్రమే కేటాయింపు ఉందని, దాన్ని 10 శాతానికి పెంచడం వల్ల మరింత పచ్చదనం పెరిగుతుందని అన్నారు.

ఇక అధికారుల్లో, ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెరగాల్సిన అవసరం ఉందని అందుకే తాము చట్ట సవరణ చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. అయితే రిజర్వేషన్ల కేటాయింపు ఐదేళ్లకోసారి మారడం వల్ల జవాబుదారీతనం ఉండడం లేదని, అందుకే 10 ఏళ్లకు పొడగిస్తే జవాబుదారీతనం పెరుగుతుందనే ఉద్దేశంతో జీహెచ్‌ఎంసీ రిజర్వేషన్లు రెండు పర్యాయాలు కొనసాగేలా చట్ట సవరణ చేస్తున్నట్లు తెలిపాడు. ఇక రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాతనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేలా చట్ట సవరణ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.